గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (14:47 IST)

గవర్నరును కలువనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ త్వరలోనే ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో సమావేశంకానున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆయన తనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలని కోరే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 
 
కాగా, ఎస్ఈసీ నుంచి నిమ్మగడ్డను తొలగించేందుకు ఏపీ సర్కారు ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్ తెచ్చింది. దీన్ని హైకోర్టు కొట్టివేసింది. పైగా, రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి పునర్నియమించాలని సూచన చేసింది. కానీ, ఏపీ సర్కారు మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. అక్కడ కూడా ఏపీ సర్కారుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడొద్దంటూ హితవు పలికింది. 
 
ఈ నేపథ్యంలో గవర్నర్ హరిచందన్‌తో సమావేశం కావాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించారు. పైగా, ఈ సందర్భంగా ఆయన తనను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నియమించాలని కోరనున్నట్టు సమాచారం. ఎందుకంటే. రాజ్యాంగబద్ధమైన నియామకాలను గవర్నరు చేపడుతున్న విషయం తెల్సిందే.