శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 4 ఏప్రియల్ 2020 (22:00 IST)

ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్

రైతు పక్షపాతిగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ సాగాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆదేశించారు. ప్రత్యేకించి ధాన్యం క్రయ,విక్రయాలకు సంబంధించి ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా వ్యవస్ధా పరమైన లోపాలను అధికమించాలని స్పష్టం చేసారు. రాజ్ భవన్‌లో శనివారం వ్యవసాయ మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు.
 
మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూధన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోనా శశిధర్, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రధ్యుమ్న, పౌర సరఫరాల సంస్ధ ఎమ్‌డి సూర్య కుమారి తదితరులు, వేర్వేరుగా సాగిన సమావేశాలలో పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలతో సమావేశమైన హరిచందన్ లాక్ డౌన్ వేళ వ్యవసాయ పనులు ఆగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఆహార ధాన్యాల ఉత్పత్తికి అవాంతరం ఏర్పడితే పలు ఇక్కట్లను ఎదుర్కోవలసి వస్తుందన్నారు.
 
ప్రస్తుత రబీ సీజన్లో పౌర సరఫరాల సంస్ధ ద్వారా 32.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసామని అధికారులు గవర్నర్ కు వివరించారు. రైతు కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలోనే నేరుగా ధాన్యం కొనుగోలు చేసి అక్కడి నుండే రవాణా జరిగేలా ఏర్పాట్లు చేసామని, నగదు సైతం రైతుల ఖాతాలలోనే జమ అయ్యేలా పూర్తి కంప్యూటరీకరణతో పారదర్శకంగా పనులు జరిగేలా ఏర్పాట్లు చేసామని కోనా శశిధర్ గవర్నర్‌కు వివరించారు.
 
గ్రామం ఒక యూనిట్‌గా మార్కెటింగ్ వ్యూహాలను సిద్దం చేసామని, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పరంగా ఎటువంటి ఆటంకాలు కలిగించ వద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసామని మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూధన్ రెడ్డి గౌరవ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.
 
సగటు ప్రజలకు ఏవిధమైన ఇబ్బంది కలగని రీతిలో ముఖ్యమైన వస్తువుల మార్కెటింగ్‌కు సంబంధించి పూర్తి స్ధాయి కార్యాచరణ అమలు చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రధ్యుమ్న గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో గవర్నర్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు సమస్యల పరిష్కారంలో అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని సూచించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఈ విషయంలో ప్రత్యేక ఆసక్తిని చూపుతున్నారని, వారి ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయదారులతో వ్యవహరించాలని బిశ్వ భూషణ్ పేర్కొన్నారు. సమావేశంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.