సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (13:01 IST)

సామాన్యులకు ప్రపంచ స్థాయి వైద్యాన్ని పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి..

ప్రపంచ ప్రఖ్యాత రేడియాలజిస్టు డాక్టర్ కాకర్ల సుబ్బారావు శుక్రవారం కన్నుమూశారు. ఈయన మృతిపై ప్రముఖ రాజకీయ నేతలంతా తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. అయితే, ఈయన జీవిత చరిత్రను ఓసారి పరికిస్తే, 
 
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలో 1925 జనవరి 25న కాకర్ల సుబ్బారావు జన్మించారు. ఊళ్లో పాఠశాల లేకపోవడంతో ఇంటి వరండాలోనే పాఠశాలను ఏర్పాటుచేయించారు సుబ్బారావు తండ్రి. ఏడో తరగతి వరకు సుబ్బారావు అక్కడే చదువుకున్నారు. 
 
అనంతరం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చల్లపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నంలోని హిందూ కళాశాలలో పూర్తిచేశారు.
 
తొలుత ఇంజినీర్‌ కావాలనుకొని డాక్టర్‌ అయ్యారు. వైద్య వృత్తి చేపట్టాలని ఎప్పుడూ అనుకోలేదట. తల్లిదండ్రులకు కూడా అది ఇష్టం లేదట. ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేసుకుంటే సీటు రాలేదు. దీంతో నిరాశ చెందిన సుబ్బారావు అప్పటికే తెప్పించి పెట్టుకున్న దరఖాస్తు ద్వారా ఎంబీబీఎస్‌కు అప్లై చేశారు. 
 
సీటు రావడంతో ఇంట్లో చెబితే వద్దంటారేమోనని ఎవరికీ చెప్పకుండా విశాఖపట్నం వెళ్లి మెడిసిన్‌లో చేరారు. ఎంబీబీఎస్‌ అయిన తర్వాత కూడా ఆర్మీలో చేరాలనుకున్నారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో అధికారులు నిరాకరించారు. 
 
యాదృచ్ఛికంగా 1951లో రేడియాలజీ చదివేందుకు అమెరికా వెళ్లారు. వచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకుంటూ వైద్య విద్యలో నైపుణ్యం సాధించారు. న్యూయార్క్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్‌ పూర్తిచేశారు. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ రేడియాలజీలో ఫెలోషిప్‌ కూడా పూర్తిచేశారు. అనంతరం భారత్‌కు తిరిగివచ్చారు.
 
1956లో స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ వచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో చేరి, ఐదేళ్లలోనే ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగారు. చీఫ్‌ రేడియాలజిస్ట్‌గా పనిచేశారు. మొత్తం 14 ఏళ్లపాటు ఉస్మానియాలో విధులు నిర్వర్తించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తిరిగి అమెరికా వెళ్లారు. 
 
1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ అమెరికా పర్యటనకు వెళ్లి జన్మభూమికి సేవ చేసేందుకు ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి రావాలని పిలుపునివ్వడంతో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సుబ్బారావు మాతృభూమికి సేవచేయాలని స్వరాష్ట్రానికి తిరిగివచ్చారు. ఇక్కడ పరిస్థితులు బాగోలేక మళ్లీ తిరిగి వెళ్లిపోయారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి వెళ్లి భారత్‌కు తిరిగివచ్చి ఇక్కడ సేవ చేయాలని ఆయన్ను కోరారు. దీంతో కాకర్ల మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చారు.
 
పేదలకు అధునాతన వైద్యం అందించాలని నిర్ణయించుకున్నారు. నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)ని అత్యున్నత స్థాయి వైద్యసంస్థగా తీర్చిదిద్దారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకే నమూనాగా మలిచారు. సామాన్యులకు ప్రపంచస్థాయి వైద్యాన్ని పరిచయం చేశారు.
 
అమెరికాలోని తెలుగువారందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని కాకర్ల పలువురితో చర్చించారు. ఇది తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్ అమెరికా (తానా) ఆవిర్భావానికి దారితీసింది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంతో సుబ్బారావుకు ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. 
 
కలాం సేవాదృక్పథం, స్ఫూర్తినిచ్చే జీవన విధానం ఎంతగానో నచ్చేవి. ఇదే ఆయనను కలాంకు అభిమానిగా మార్చేసింది. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.