పాత మద్యం బ్రాండ్లను మళ్లీ తీసుకురావాలి..నంద్యాల బ్యాలెట్ బాక్సుల్లో స్లిప్పులు
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. విశాఖలో బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాసిన స్లిప్పులు కూడా దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.
కర్నూలు జిల్లా నంద్యాలలోనూ ఇలాంటి స్లిప్పులే వెలుగుచూశాయి కానీ వాటిలో రాసిన మేటర్ మాత్రం వేరు! నిన్న ఓట్ల లెక్కింపు సందర్భంగా నంద్యాల 29వ వార్డు బ్యాలెట్ బాక్సులను తెరిచిన సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.
నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ ఆ చీటీల్లో ముద్రించి ఉన్న సందేశం వారిని విస్మయానికి లోనుచేసింది. ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లను తొలగించాలని, పాత మద్యం బ్రాండ్లను మళ్లీ తీసుకురావాలని ఆ స్లిప్పుల్లో పేర్కొన్నారు.
సుప్రీం, జంబో, హైదరాబాద్, దారు వంటి నూతన బ్రాండ్లు తమకు వద్దని... రాయల్ స్టాగ్, బ్లాక్ డాగ్, ఇంపిరీయల్ బ్లూ వంటి పాత బ్రాండ్లు మళ్లీ తీసుకురావాలని కోరారు. తాము కోరిన పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇదే తమ చివరి ఓటు అవుతుందంటూ సీఎంను ఉద్దేశించి స్పష్టం చేశారు.