బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (16:19 IST)

అమరావతికి పంచాయతీ ఎన్నికలే..

రాజధాని అమరావతి ప్రాంతాన్ని టీడీపీ హయాంలో మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌గా ప్రకటించకపోవడంతో.. ఆ 29 గ్రామాల్లో ఈసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల పరిధిని రాజధాని నగరంగా ఏర్పాటు చేస్తామని 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గ్రామ పంచాయతీలుగా ఉన్న ఆ 29 గ్రామాలను పట్టణ ప్రాంతంగానో, నగర ప్రాంతంగానో ప్రకటించడానికి ప్రభుత్వం తరఫున చిన్న ప్రయత్నం కూడా జరగలేదు. 
 
గ్రామ పంచాయతీని పట్టణ లేదా నగర ప్రాంతంగా అధికారికంగా గుర్తించాలంటే గరిష్టంగా మూడు నాలుగు నెలలకు మించి సమయం పట్టదు. అయితే నాలుగేళ్ల కాలంలో ఆ గ్రామాలన్నింటిని కలిపి నగర ప్రాంతంగా ప్రకటించే ప్రక్రియను పూర్తిగా విస్మరించారు.
 
 పట్టణ లేదా నగర ప్రాంతంగా మార్చేందుకు  సంబంధిత ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధి ద్వారా లేదా జిల్లా కలెక్టరు స్వయంగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలి. తర్వాత నగర ప్రాంతంగా మార్చేందుకు అంగీకారం తీసుకునేందుకు 29 గ్రామ పంచాయతీల్లో వేర్వేరుగా తీర్మానాల ద్వారా ఆమోదం తెలపాలి.
 
ఈ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటే తర్వాత ఆ ప్రాంతాన్ని పంచాయతీరాజ్‌ శాఖ తమ పరిధి నుంచి డీ నోటిఫై చేస్తుంది. మున్సిపల్‌ శాఖ పట్టణ ప్రాంతంగా గుర్తిస్తూ నోటిఫై చేయాలి. ఆ ప్రక్రియను గత టీడీపీ ప్రభుత్వం చేపట్టలేదు. గ్రామ సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టులోనే ముగిసింది.