గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (20:39 IST)

బీసీజీ నివేదిక లోగుట్టు : అమరావతి నిర్మాణం ఓ పెద్ద రిస్క్.. అక్కడ మట్టిలో బలం లేదు..

బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) తన నివేదికను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. ఇందులోకూడా అమరావతి నిర్మాణం శుద్ధదండగ అని పేర్కొన్నారు. పైగా, అమరావతి నిర్మాణానికి పెట్టే లక్ష కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖలో ఖర్చు పెడితే రాష్ట్ర సస్యశ్యామలం అవుతుందని పేర్కొంది. బీసీజీ నివేదికలో పేర్కొన్న ముఖ్యాంశాలను ప్లానింగ్ ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు కాదనీ, 13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించాలని బీసీజీ సూచించిందని తెలిపారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2.2 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉందని పేర్కొన్న బీసీజీ నివేదిక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏడు జిల్లాలు ఇంకా వెనుకబడివున్నాయని పేర్కొందని విజయ్ కుమార్ వెల్లడించారు. అలాగే, కృష్ణా - గోదావరి బేసిన్‌లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి ఎక్కవుగా ఉందని, కేజీ బేసిన్ ద్వారా 50 శాతం అగ్రికల్చర్ ఉత్పత్తి ఉందని, తలసరి ఆదాయంలో కూడా ఏపీ వెనుకబడి ఉందని నివేదికలో వివరించినట్టు చెప్పారు. 
 
అలాగే, విశాఖ నుంచి చెన్నై వరకు రోడ్డు కనెక్టివిటీ ఉందని, ఎయిర్ పోర్టు, పోర్టు విషయంలో విశాఖలో తప్ప ఎక్కడా అంతగా అభివృద్ధి లేదని గుర్తుచేసింది. అందువల్ల కోస్తా తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈ నివేదికలో పేర్కొన్నట్టు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, విజయవాడతో పోల్చితో విశాఖపట్టణంలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. 
 
అలాగే, అమరావతి నిర్మాణానికి రూ. లక్ష కోట్లు ఖర్చు అవుతుందని, ఇది అతిపెద్ద రిస్క్ అని, ఇంతమొత్తంలో ఖర్చు చేసినా అది అభివృద్ధి చెందేందుకు 40 యేళ్లు పడుతుందని, ఇదే మొత్తాన్ని ఇరిగేషన్ శాఖపై ఖర్చు చేస్తే వచ్చే ఐదేళ్లలోనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని బీసీజీ నివేదిక పేర్కొందని వెల్లడించారు. ఇపుడున్న పరిస్థితుల్లో అభివృద్ధిని వికేంద్రీకరిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. అందుకే విశాఖ, విజయవాడ, కర్నూలు ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేయాలని ఈ నివేదిక సూచన చేసిందని విజయ్ కుమార్ తెలిపారు. 
 
అదేవిధంగా అమరావతిలో కేవలం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌లు మాత్రమే ఉండాలని, విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసుతో పాటు ఏడు కీలక విభాగాలు ఉండొచ్చని, అత్యవసర సమావేశాల కోసం విశాఖలో అసెంబ్లీ, హైకోర్టులు ఉండాలని, కర్నూలులో హైకోర్టుతో పాటు లా అప్పీలేట్‌లు ఏర్పాటు చేయాలని బీసీజీ నివేదిక సూచన చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. పైగా, అమరావతి మట్టిలో బలం లేదనీ, అక్కడ పెద్దపెద్ద భవనాలు నిర్మించడం పెద్ద రిస్క్ అని ఐఐటీ మద్రాస్ పరీక్షించి చెప్పిందని గుర్తుచేశారు. పైగా, ఇతర ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ అని మద్రాస్ ఐఐటీ చెప్పిందని బీసీజీ నివేదిక గుర్తుచేసిందని విజయ్ కుమార్ వెల్లడించారు.