గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (18:45 IST)

బీర్బల్, తెనాలిలా.. పవన్ ప్రశ్నించేవారిని పక్కనబెట్టుకోవాలి.. పరుచూరి పలుకులు

తెలంగాణ ఎన్నికలు ముగిసిన వేళ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికలపై కన్నేశారు. ఇప్పటికే పోరాట యాత్ర చేసిన పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.


తాజాగా పరుచూరి పాఠాలు కార్యక్రమంలో భాగంగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ పవన్‌కు కొన్ని సూచనలు ఇచ్చారు. ఎవరో చెప్పేశారని.. అనుభవం లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే ప్రశ్నించేవారిని పక్కనబెట్టుకోవాలని పవన్‌కు పరుచూరి సూచించారు. 
 
అక్బర్ గురించి బీర్బల్ చాలా జోకులేసేవాడు. అయినా బీర్బల్‌ని అక్బర్ వదులుకోలేదు. ఎందుకంటే... తనని బీర్బల్ సున్నితంగా హెచ్చరిస్తున్నాడని అక్బర్ అనుకునేవాడు. ఇదేవిధంగా కృష్ణదేవరాయలతో తెనాలి రామకృష్ణుడు గుచ్చినట్లుగా మాట్లాడేవాడు. అయినా కృష్ణదేవరాయలు తెనాలిని పక్కనబెట్టేయలేదు. ఎందుకంటే రామకృష్ణుడి ఆంతర్యం గురించి రాయలకు బాగా తెలుసుకాబట్టి.

అందువల్ల వ్యవస్థను ప్రశ్నించేందుకు బయల్దేరిన పవన్ కల్యాణ్ కూడా ఆయన పక్కన ప్రశ్నించేవాళ్లను పెట్టుకుంటే ఆలోచించే అవకాశం ఏర్పడుతుందని పరుచూరి అన్నారు. ప్రశ్నించేవారితో కలిసి ముందడుగు వేస్తే అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతావని పవన్‌కు హితవు పలికారు. 
 
ఇదిలా ఉంటే జనసేనాని పవన్ కల్యాణ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. పలువురి ముఖ్యులతో సమాలోచనలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒక సరికొత్త విధానం గురించి చర్చించినట్లు ట్వీట్ చేశారు. పవన్‌తో పాటు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా అమెరికాలో పర్యటిస్తున్నారు.

వాషింగ్టన్‌లో అక్కడి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ బెన్ కార్బన్ తదితరులతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం పవన్ మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు గల సాధ్యాసాధ్యాలపై బెన్ కార్సన్‌తో చర్చించానని చెప్పారు.