రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)
ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామన్నారు. ఏపీకి 975 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్‌లా అభివృద్ధి చేయవచ్చన్నారు.
అలాగే ఏపీలో పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. దీనిపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారన్నారు.
ఆర్జీవీ కోసం పోలీసులు గాలిస్తున్న విషయంపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. తన పని తాను చేస్తున్నానన్నారు. పోలీసులు పనివాళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ హోంమంత్రి చూస్తారని, తాను చెయ్యడం లేదు అంటూ పవన్ కల్యాణ్ బదులిచ్చారు.
చంద్రబాబును ఇబ్బంది పెట్టినప్పుడు ధైర్యంగా వ్యవహరించిన పోలీసులు ఇప్పుడెందుకు తటపటాయిస్తున్నారనే విషయాన్ని సీఎం అడుగుతానన్నారు. ఢిల్లీలో మీడియా వాళ్లు అడిగారని చెప్తానన్నారు.
రామ్‌గోపాల్ వర్మ కనిపించకుండా పోవటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ కాగా.. ఆర్జీవీ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో రామ్‌గోపాల్ వర్మతో పాటుగా పలువురు నోటీసులు అందుకుని కూడా విచారణకు రాలేదని.. అయితే దీనిపై తాను ఇప్పుడేమీ స్పందించనంటూ పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ విషయంలో పోలీసులను వారి పని వారిని చేసుకోనివ్వాలని అన్నారు. హోం శాఖ, శాంతిభద్రతలు తన పరిధిలో లేవన్న పవన్ కళ్యాణ్.. తనకు అప్పగించిన శాఖలపై మాట్లాడాలంటే మాట్లాడతానని చెప్పారు. ఏవైనా ఉంటే అడగాల్సింది సీఎం చంద్రబాబు నాయుడునని చెప్పారు. శాంతిభద్రతల అంశం హోంమంత్రి పరిధిలోదని.. హోం మంత్రి చూస్తారని, తాను చెయ్యడం లేదంటూ నవ్వుతూ బదులిచ్చారు.
ఢిల్లీలో ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇక బుధవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.