గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (09:46 IST)

రౌడీల్లా గొడవలు పెట్టుకోం.. ఉసురు తగులుతుంది : పవన్ కళ్యాణ్

రౌడీలుగా మాదిరిగా మేము గొడవులు పెట్టుకోం. బాధ్యతగల ఎమ్మెల్యే ఎలా ఉంటారో మీకు చూపించబోతున్నామని జనసేన పార్టీ అధినేత, భీమవరం అసెంబ్లీ అభ్యర్థి పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, తనకు భీమవరంతో చిన్నప్పటి నుంచి ఎంతో అనుబంధం ఉందన్నారు. అందుకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 
 
అన్నదమ్ములు ఆడపడుచులు ఒక బలమైన పాత్ర కోరుకుంటున్నారని చెప్పారు. సగటు యువత కొత్తతరం పాలన కోరుకుంటుంది. వారికోసం జనసేన పార్టీ పుట్టిందన్నారు. సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే జనంలోకి వచ్చానంటూ పవన్‌ స్పష్టం చేశారు.
 
అర్బన్‌ బ్యాంక్‌ దోపిడితో పది వేల కుటుంబాల భవిష్యత్‌, వారి ఆశలను గ్రంధి శ్రీను అనుచరులు దెబ్బతీశారని విమర్శించారు. పదివేల కుటుంబాల కష్టార్జితం దోచేస్తే వారి ఉసురుతగలదా మీకు గ్రంధి శ్రీనుగారు... అంటూ సూటిగా ప్రశ్నించారు. 
 
భీమవరం ప్రభుత్వాసుపత్రిని అత్యాధునిక ఆస్పత్రిగా మార్చుతానని చెప్పారు. భీమవరానికి ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేసినా యనమదుర్రు డ్రైయిన్‌ కంపు పోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక పట్టణంలో ఓవర్‌బ్రిడ్డి, బైపాస్‌ రోడ్డు సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు. 
 
ప్రజా సమస్యపై ఎటువంటి దరఖాస్తు వచ్చినా తానే పరిశీలించి పరిష్కరిస్తానన్నారు. తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలో ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా పట్టణానికి డంపింగ్‌ యార్డును నిర్మిస్తానన్నారు.
 
పోరాటం చేసి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజుకు ఇక్కడ విగ్రహం లేదు. పొట్టి శ్రీరాములకు పెద్ద విగ్రహం లేదు. కానీ అవినీతి నాయకుల విగ్రహాలు మాత్రం పెడతారు. నేను ఎమ్మెల్యే అయ్యాక అల్లూరి సీతారామరాజు వంద అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.