గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (15:28 IST)

టీడీపీతో పొత్తు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు : సోము వీర్రాజు

somu veerraju
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా మాట్లాడలేదని, అందువల్ల ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం రాత్రి జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీతో ఉంటే జనసేనకు ముస్లింలు దూరవుతారని కొందరు అంటున్నారని, ముస్లింలకు ఇష్టంలేకపోతే బీజేపీకి తాను దూరమవుతానని చెప్పారు. ఒకవేళ బీజేపీతో పొత్తులో ఉన్నపుడు వారిపై ఎక్కడైనా దాడి జరిగితే పొత్తు నుంచి బయటకు వస్తానని తెలిపారు.
 
ఈ వ్యాఖ్యాలపై సోము వీర్రాజు స్పందిస్తూ, టీడీపీతో జనసేన పొత్తు గురించి పవన్ కళ్యాణ్ ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుతానని చెప్పారు. నాలుగేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని వీర్రాజు అన్నారు. విశాఖ రాజధాని అని చెబుతూ ఉత్తరాంధ్ర ప్రజలను సీఎం జగన్ మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసిందని చెప్పారు.