శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

అఖిలప్రియా.. తల్లిదండ్రులులేని బాధ మీకు తెలియదా? పవన్ కళ్యాణ్ ప్రశ్న

కృష్ణపవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డి పరామర్శించక పోవడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తప్పుబట్టారు.

కృష్ణపవిత్ర సంగమం వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియా రెడ్డి పరామర్శించక పోవడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తప్పుబట్టారు. శనివారం ఒంగోలులోని ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. గతనెల 12న పడవ ప్రమాదం జరిగిన సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నందునే రాలేకపోయానని. తనను క్షమించాలని కోరారు. ప్రమాద మృతులకు తగిన న్యాయం జరగలేదని పవన్‌ అభిప్రాయపడ్డారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పర్యాటక మంత్రిగా ఉన్న అఖిలప్రియ ఒంగోలు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పి ఉండాల్సిందన్నారు. కానీ ఆమె ఆ పని చేయలేదన్నారు. తల్లిదండ్రులులేని బాధ ఎలా ఉంటుందో అఖిల ప్రియకు తెలుసునని... ఆమె ఆమాత్రం చొరవచూపకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 
 
ముఖ్యంగా, "మంత్రి అనగానే రెడ్‌లైట్‌, ఎస్కార్ట్‌తో తిరిగితే సరిపోదు. ఆప్తులను కోల్పోయిన బాధ అందరికంటే ఎక్కువ తెలిసిన మీరు ఒంగోలుకు రండి! మృతుల కుటుంబాలతో మాట్లాడండి" అని అఖిలప్రియకు సూచించారు. భూమా కుటుంబం ప్రజారాజ్యంలో ఉన్నప్పటి నుంచి తనకు తెలుసునన్నారు. అందువల్లే భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తాను ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయలేదని గుర్తుచేశారు.
 
నిజానికి "ఆ సమయంలో నేను నంద్యాలకు వెళ్లాల్సింది. కానీ... పవన్‌ ప్రచారం చేస్తే ఓడిపోతానని, రాకుండా చూడాలని మా వాళ్లకు నాగిరెడ్డి ఫోన్‌ చేసి కోరారు. అప్పటికే శోభా నాగిరెడ్డి మృతితో దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఇంకా దుఃఖంలోకి నెట్టడం ఇష్టంలేక నేను నంద్యాలలో టీడీపీ తరపున ప్రచారం చేయలేదు" అని పవన్‌ వివరించారు. 
 
అలాగే, నంద్యాల ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని రంగంలో పెట్టాల్సి ఉందని... తల్లిదండ్రులను కోల్పోయి బాధలో ఉన్న పిల్లలను ఇంకా బాధ పెట్టరాదనే పోటీ చేయలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మరి పవన్ వ్యాఖ్యలపై మంత్రి భూమా అఖిలప్రియారెడ్డి ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.