సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (17:44 IST)

మిత్రుని కోసమే భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్ రద్దు : పవన్ కళ్యాణ్

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన మృతికి సంతాప  సూచకంగానే తాను నటించిన భీమ్లా నాయక్ చిత్రం ప్రిరిలీజ్ వేడుకను వాయిదా వేసినట్టు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. 
 
సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఆయన ఆత్మకు నివాళులర్పించారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని గౌతం రెడ్డి నివాసానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 
 
ఈ సందర్బంగా నెల్లూరులో మేకపాటి కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతం రెడ్డి చేస్తున్న కృషిని పవన్ కళ్యాణ్ కొనియాడారు. రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన ఆయన.. వ్యాపారంలో వచ్చిన సొమ్మును ప్రజాసేవకే వెచ్చించారన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపేందుకే తన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.