19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించారు.
కాగా, పవన్ కల్యాణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. జూన్ 19వ తేదీన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు.
వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు రాగా, వైసీపీకి 11 స్థానాలు దక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా 24 మంది ప్రమాణం చేశారు. మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు.