శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (09:43 IST)

నేడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు : ప్రధాని మోడీ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. 
 
అలాగే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాభినందనలు. సుదీర్ఘకాలం పాటు మీరు ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా" అన్నారు. 
 
ఇకపోతే, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా సీఎం జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్, దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను" అని తెలుగులో ట్వీట్ పెట్టారు. 
 
ఇకపోతే, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా సామాజిక మాధ్యమాల వేదికగా జగన్‌కు అభినందనలు తెలిపారు. "ప్రియతమ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌కి జన్మదిన శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజారంజకంగా పాలించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అని ఆకాంక్షించారు. 
 
అదేవిధంగా వైకాపా శ్రేణులు, పార్టీ నేతలు జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా... జగన్ పుట్టిన రోజు శుభసందర్భంలో ఓ బాలికను దత్తత తీసుకున్నారు.