శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (17:33 IST)

గన్నవరం టీడీపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావుపై కేసు

cbn - yarlagadda
టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తాజాగా నియమితులైన యార్లగడ్డ వెంకట్రావుపై కృష్ణా జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కృష్ణాలో చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా రంగన్నగూడెం వద్ద ఉద్రిక్తలు నెలకొన్నాయి. అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య బాహాబాహీగా తలపడ్డారు. 
 
ఒక దశలో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసునేంత స్థాయికి వెళ్లాయి. అయితే, ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం, ఎస్సీఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో 50 మందిపైగా టీడీపీ కార్యకర్తలు నిందితులుగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావును ఈ కేసులో ఏ1 నిందితుడిగా పేర్కొన్నారు. అమెరికాలో ఉన్న ఆళ్ల గోపాలకృష్ణారెడ్డి అనే వ్యక్తిని కూడా ఈ కేసులో నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. అలాగే, ఆ పార్టీ సీనియర్ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలపై కూడా రంగన్నగూడెం ఘర్షణలకు సంబంధించి కేసు నమోదైంది.