సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని టీడీపీ జాతీయ కార్యాలయానికి నోటీస్
మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి కేసులో ఏపీ పోలీసులు ఆ పార్టీకి నోటీసులు జారీ చేశారు. దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తమకు ఇవ్వాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని కోరారు.
తెదేపా పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి ఘటన అనంతరం కార్యాలయ ఉద్యోగి బద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, కొందరు కార్యాలయ సిబ్బందిపై కూడా దాడి చేసి, వారిని కర్రలతో కొట్టారని వివరించారు. కొన్ని కార్లు కూడా ధ్వంసం చేశారని, సుత్తులు, కర్రలు, ఇతర మారణాయుధాలతో వచ్చారని పేర్కొన్నారు.
కార్యాలయ ఉద్యోగి బద్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కార్యాలయ రిసెప్షన్ కమిటీ సభ్యుడు కుమారస్వామికి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా వివరాలు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు.