బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 18 అక్టోబరు 2021 (11:23 IST)

తాడేపల్లి అత్యాచార నిందితుడి ఆచూకీ తెలపండి...

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన తాడేపల్లి అత్యాచార ఘటన నిందితుడు ఎక్కడైనా, ఎవరికైనా కనిపిస్తే చెప్పాలంటూ పోలీసులు ఫేస్‌బుక్ ద్వారా కోరారు. రెండు ఫొటోలు, వివరాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. సీతానగరం పుష్కరఘాట్ వద్ద కొన్ని నెలల క్రితం యవతిపై జరిగిన అత్యాచారం కేసులో ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్ ఎ-2 నిందితుడిగా ఉన్నాడు. ఎ-1 కృష్ణతోపాటు అతడి వద్ద సెల్‌ఫోన్లు తాకట్టు పెట్టుకున్న మరో వ్యక్తిని ఎ-3గా చూపించి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఎ-2 ప్రసన్నరెడ్డి మాత్రం పోలీసులకు చిక్కడం లేదు.  దీంతో నిన్న అతడి వివరాలను ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించిన పోలీసులు కనిపిస్తే చెప్పాలని కోరారు.
 
‘‘వెంకట్‌ది ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కుక్కలవారిపాలెం. పూర్తిపేరు రామలింగం ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్. వయసు 22 సంవత్సరాలు. కుడిచేతిపై పుణ్యవతి అనే పచ్చబొట్టు ఉంటుంది. రైళ్లలో యాచిస్తూ సమోసాలు విక్రయించే వారితో తిరుగుతుంటాడు. అప్పుడప్పుడు క్యాటరింగ్ పనులకు వెళ్లడం, తాపీపని వంటి పనులు కూడా చేస్తుంటాడు. అత్యాచార ఘటన తర్వాత అండర్‌పాస్‌ల వద్ద, పాడుబడిన భవనాల్లోను, రైలు పట్టాల పక్కన, అన్నదానాలు చేసే ఆలయాల పక్కన ఆశ్రయం తీసుకుంటున్నాడు. నిందితుడిని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వండి’’ అని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన నోట్‌లో పోలీసులు పేర్కొన్నారు.