శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నేడు ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సీఎం జగన్ పర్యటన

ys jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి వైఎస్ఆర్, బూచేపల్లి సుబ్బారెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అలాగే, స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి, మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. 
 
ఈ పర్యటన కోసం సీఎంవో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి ఉదయం 10.35 గంటలకు చీమకుర్తికి చేరుకుంటారు. ఉదయం 10.55 గంటలకు చీమకుర్తి ప్రధాన రోడ్డులోని బూచేపల్లి కళ్యాణమండపం వద్ద వైఎస్ఆర్ విగ్రహం, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బీవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.40 గంటలకు తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. 
 
మరోవైపు, సీఎం జగన్ జిల్లా పర్యటనను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ ఏర్పాట్లను ఎస్పీ మల్లికా గార్గ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీతో పాటు వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు కూడా భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.