మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (12:36 IST)

పీఆర్సీ వివాదం : నేడు ఏపీ హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వేతన స్కేలు (పీఆర్సీ) పెద్ద దుమారాన్నే రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కొత్త వేతనాలను ఇచ్చేలా ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే, ప్రభుత్వం ఉద్యోగులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సమ్మె చేయాలని నిర్ణయించారు. 
 
ఇదిలావుంటే, ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో ఈ పీఆర్సీ జీవోలపై సోమవారం హైకోర్టులో విచారణ జరుగనుంది. సర్వీస్ బెనిఫిట్స్‌ను తగ్గించడంపై ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెక్షన్ 78(1)కి విరుద్ధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో ఉందని, దీన్ని రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఫైనాన్స్, రెవెన్యూ కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్‌ను చేర్చారు.