శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:29 IST)

నేటి నుంచి ప్రజా చైతన్య యాత్రలు

వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు, ప్రజలు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు.

వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అసమర్థ, అవినీతి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పాలనా విధానాలు, ప్రజలను మోసగిస్తున్న తీరుపై ప్రజల్లో చైతన్యం తెస్తామని వెల్లడించారు.

ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తామన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు చైతన్యయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
 
ప్రజలకు ఉపయోగపడే పథకాల రద్దు
45 రోజులపాటు టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాచైతన్య యాత్ర జరగనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. ప్రజాచైతన్య యాత్ర కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు.

ప్రజాచైతన్య యాత్రను ప్రకాశం జిల్లాలో చంద్రబాబు ప్రారంభించనున్నారు. వైసీపీ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు పేర్కొన్నారు. వైకాపా 9 నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచిందని విమర్శించారు.

ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ, విద్యుత్, పెట్రో ఛార్జీలు పెంచారని ధ్వజమెత్తారు. ఇప్పటికే అర్హుల పింఛన్లు తొలగించారన్న వెంకట్రావు... మరిన్ని తొలగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

అధికార పార్టీ నేతలు బలవంతంగా జె-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జె-ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని ఆరోపించారు.