గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2023 (08:33 IST)

వివేకా హత్య కేసులో కీలక మలుపు.. సునీతపై పులివెందుల పోలీసుల కేసు

viveka deadbody
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలతో పాటు ఈ హత్య కేసును విచారిస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్‌లపై కడప జిల్లా పులివెందుల పోలీసుల కేసు నమోదు చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న వివేకా కుమార్తె దంపతులపై సీఎం జగన్ సొంత ఊరుకు చెందిన పోలీసులు కేసు నమోదు చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని వివేకా పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కొందరు నేతల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని, ప్రత్యేకింది ఎస్పీ రాంసింగ్ ఒత్తిడి తెస్తున్నారని పిటిషన్‌లో వివరించారు. 
 
సీబీఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని  వివేకా కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బురాజన్‌ను కలిసి వినతి పత్రం అందజేశానని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్‌లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు ఐపీసీ సెక్షన్ 156(3) కింద శనివారం కేసు నమోదు చేయగా, ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.