గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (15:34 IST)

వివేకా హత్య కేసులో ఒకటి రెండు అరెస్టులు తప్పవు : రఘురామకృష్ణం రాజు

raghuramakrishnamraju
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో తేలిపోయిందని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. పైగా, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలో చాలా మార్పు రావడాన్ని తాను స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆయన సోమవారం మాట్లాడుతూ వివేకాను ఎవరు హత్య చేశారో సీబీఐ విచారణలో ఇప్పటికే తేలిపోయిందన్నారు. హత్య చేయించిన వారు ఎవరనే విషయం, వివేకా శరీరానికి ఎవరు కుట్లు వేశారు.. రక్తాన్ని ఎవరు శుభ్రం చేశారు అనే విషయాలపై క్లారిటీ రావాల్సివుందన్నారు. 
 
ముఖ్యంగా, కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ రెండోసారి నోటీసులు ఇచ్చారంటే ఆయన విషయంలో ఏదో ఊహించని పరిణామం జరగబోతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి రెండు మూడు అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 
 
మరోవైపు, బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గంలో మంచి పలుకుబడివున్న వ్యక్తుల్లో ఒకరని, అలాంటి వ్యక్తి టీడీపీలో చేరనుండటం మంచి శుభపరిణామం అని చెప్పారు. అయితే, దీన్ని వైకాపా నేతలు పెద్ద రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. కన్నా నిర్ణయంతో తమ సొంత పార్టీ నేతలు ఉలికిపాటుకు కూడా గురైవుంటారని చెప్పారు. 
 
హీరో తారకరత్న చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. తారకరత్న విషయంలో లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సరికాదని, సాక్షి పత్రికలో దరిద్రపు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు.