శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (22:06 IST)

సీఎం జగన్ ప్రేరణతోనే బీజేపీ నేతపై దాడి.. ఆర్ఆర్ఆర్ ఆరోపణ

sathya kumar car
అమరావతిలో భారతీయ జనతా పార్టీకి చెందిన నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై అమరావతిలో వైకాపా శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. ఈ విషయాన్ని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (ఆర్ఆర్ఆర్) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రధాని మోడీకి రఘురామ రాజు ఓ లేఖ రాశారు. 
 
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించడం వల్లే సత్యకుమార్‌పై దాడి జరిగిందని, తన లేఖలో పేర్కొన్నారు. దాడి  విషయం తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని ప్రధానికి వివరించారు. ఈ దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. 
 
కాగా, రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికి వస్తుండగా, ఆయనకు కారును అడ్డుకున్న కొన్ని వైకాపా శ్రేణులు దాడులు చేశారు. ఈ దాడిలో సత్యకుమార్ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సత్యకుమార్ దాడి ఘటనపై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు, ఈ దాడి ఘటనపై ఏఎస్పీ అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు సకాలంలో స్పందించడం వల్లే విపరీత పరిణాలు చోటు చేసుకోలేదని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా విధులు నిర్వహించామని తెలిపారు. బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. బీజేపీ నేతలు గుంటూరు వెళుతూ అనుకోకుండా సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి రావడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. కాగా, ఈ దాడి ఘటనపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. 
 
మరోవైపు ఈ ఘటనపై ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం మండిపడ్డారు. ప్రత్యర్థులపై భౌతికదాడులే మీ దృష్టిలో ప్రజాస్వామ్యమా ముఖ్యమంత్రి జగన్ గారూ అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాష్ట్ర రాజధాని అని మీరు చెప్పిన మాటనే మా జాతీయ కార్యదర్శి సత్యమూర్తి గుర్తుచేస్తే ఈ పద్ధతిలో దాడులకు పాల్పడడం దిగజారుడు రాజకీయం కాదా? ఈ ఘటనకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు.