జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ - పులివెందులకు ఉప ఎన్నిక!
వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీకి రాకుంటే శాసనసభ సభ్యత్వాన్ని పీకిపడేస్తామని, అపుడు పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందన్నారు.
గత ఎన్నికల్లో వైకాపా కేవలం 11 పార్టీలకే సరిపెట్టుకుంది. దీంతో ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పాలన సాగించిన జగన్... చివరకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీంతో ఆయనతో పాటు వైకాపా సభ్యులంతా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. దీనిపై ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు స్పందించారు. ప్రతిపక్ష హోదా దక్కలేదనే కారణంతో వైకాపా సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుంటే వారి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమని ఆయన హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా, ప్రతపక్ష హోదా కోసం జగన్ ఒక చంటి పిల్లాడిలా మారాం చేయడం విచిత్రంగా ఉందన్నారు.
అసెంబ్లీ నిబంధనల ప్రకారం 10 శాతం అంటే కనీసం 18 స్థానాలు గెలిచిన పార్టీకే ప్రతిపక్ష హోదా లభిస్తుందన్నారు. ఈ సాధారణ విషయం తెలిసినప్పటికీ జగన్ విపక్ష హోదా కోసం పట్టుబడుతున్నారని వ్యాఖ్యానించారు. చట్ట సభల వరుసగా 60 రోజుల పాటు సభ్యులు గైరుహాజరైతే వారి సభ్యత్వం వాటంత అదే రద్దు అవుతుందని ఆయన గుర్తు చేశారు.
తాను ఉప సభాపతిగా, వైకాపా సభ్యులు సభా కార్యకలాపాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. వారు సభకు రాకుండా ఉప ఎన్నికలనే కోరుకుంటున్నట్టు కనిపిస్తుందన్నారు. అదే వారి ఉద్దేశమైతే మేం చేయగలిగింది ఏమీ లేదన్నారు. పులివెందులకు ఉప ఎన్నిక ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.