1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అమరావతిని తరలించడం సాధ్యంకాదని అర్థమైంది.. అందుకే ప్రైవేటు బిల్లు : ఆర్ఆర్ఆర్

raghurama
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించడం సాధ్యంకాదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి అర్థమైందని అందుకే రాజ్యసభలో మూడు రాజధానుల అంశంపై ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారని వైకాపా రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు అన్నారు. 
 
రాజ్యసభలో విజయసాయి రెడ్డి మూడు రాజధానుల అంశంపై ఓ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై "ఆర్ఆర్ఆర్" స్పందించారు. అమరావతిని అక్కడ నుంచి తరలించడం అసాధ్యమని తేలిపోయిందన్నారు. అందుకే మూడు రాజధానుల కోసం ప్రైవేటు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే, అమరావతిని ఒక్క అంగుళం కూడా అక్కడ నుంచి తరలించలేరన్నారు. 
 
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమతమ రాష్ట్రాల సమస్యలు ఏకరవు పెట్టారని, కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఆ ఊసే ఎత్తలేకపోయారన్నారు. దీనికి కారణం కేసుల భయమన్నారు.
 
అలాగే, ప్రధాని మోడీ సైతం మాతృభాషలో విద్యా బోధన సాగాలని సూచన చేస్తున్నారని చెప్పారు. కానీ, సీఎం జగన్ మాత్రం ఉన్న పాఠశాలలు మూసివేస్తూ, ఆంగ్ల బోధనకు జై కొడుతున్నారన్నారు. ఆంధ్రరాష్ట్రంలో తెలుగు అనేది లేకుండా చేయాలన్నది జగన్ అండ్ కో కుట్రలా ఉందని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.