మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఇప్పటికైనా మొండిపట్టువీడింది.. పరీక్షల రద్దు ప్రజా విజయం : రఘురామ

పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం వెలువరించడాన్ని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్వాగతించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండిపట్టును వీడిందంటూ వ్యాఖ్యానించారు. 
 
పరీక్షల రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా హెచ్చరికలు కూడా చేసింది. దీంతో దిగివచ్చిన ఏపీ సర్కారు పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు గురువారం సాయంత్రం ప్రకటించింది. 
 
దీనిపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిందని, ఇది ప్రజా విజయం అని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో సకాలంలో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. 
 
కనీసం ఇప్ప టికైనా సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు రఘురామ వివరించారు. అటు, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పరీక్షల రద్దు నిర్ణయంపై ట్వీట్ చేశారు. 
 
ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చిందని, రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేశారని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నించారని, తెలుగుదేశం పార్టీ కోర్టును ఆశ్రయించడం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ కలిసి గట్టిగా పోరాడడం వల్ల ప్రభుత్వం మనసు మార్చుకుందని పేర్కొన్నారు.