మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (15:35 IST)

ఏపీ మంత్రివర్గంలో నిజాయితీగా మాట్లాడే వారిలో గౌతం ఒకరు : ఆర్ఆర్ఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో నిజాయితీగా మాట్లాడే అతికొద్ది మంత్రుల్లో మేకపాటి గౌతం రెడ్డి ఒకరని వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. సోమవారం హఠాన్మరణం చెందిన మంత్రి గౌతం రెడ్డి మృతిపై ఆయన తన సంతాన్ని తెలిపారు. మేకపాటి గౌతం రెడ్డి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. గుండెపోటుతో గౌతం చనిపోయారని తెలియగానే తాను షాక్‍‌కు గురైనట్టు చెప్పారు. 
 
ఆయన మరణం తీవ్ర ఆవేదన కలిగిస్తుందన్నారు. ఏపీ మంత్రివర్గంలో నిజాయితీగా మాట్లాడే అతికొద్దిమంది మంత్రుల్లో గౌతం ఒకరని ఆయన చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. 
 
గౌతం రెడ్డి మరణం వైకాపాకు తీరని లోటు : ఎమ్మెల్యే రోజా  
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మృతి వైకాపాకు తీరని లోటని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సినీ నటి ఆర్.కె.రోజా అన్నారు. సోమవారం గౌతం రెడ్డికి తీవ్రమైన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఆయన మృతిపట్ల ఆర్.కె.రోజా స్పందించారు. గౌతం రెడ్డి ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిసివేసిందన్నారు. గౌతం రెడ్డి తనకు సోదరుడు వంటివారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. 
 
ఉన్నత విద్యను అభ్యసించిన గౌతం రెడ్డి.. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే స్వభావం కలిగిన వారని చెప్పారు. ఆయన మరణం వైకాపాకు తీరని లోటని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గౌతం రెడ్డిలు మంచి స్నేహితులని గుర్తుచేశారు.
 
కాగా, కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది గుండెపోటుకుగురై మృత్యువాతపడుతున్నారని చెప్పారు. గౌతంరెడ్డితో చివరిసారిగా 20 రోజుల క్రితం తాను మాట్లాడినట్టు చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆమె చెప్పారు. 
Koo App
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. వారి లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను… - Chinta Anuradha (@chintaanuradha) 21 Feb 2022