ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 27 ఆగస్టు 2021 (20:07 IST)

గాయత్రిని మోసం చేసాడు, ఒక్కొక్కరికీ ఒక్కో ట్రబుల్ పెట్టాడు, అందుకే చంపేసారు

విజ‌య‌వాడ‌లో సంచ‌ల‌నం క‌లిగించిన యువ పారిశ్రామిక‌వేత్త రాహుల్ హ‌త్య కేసు మిస్ట‌రీని పోలీసులు ఛేదించారు. ఇది వ్యాపార లావాదేవీల‌కు సంబంధించి చేసిన హ‌త్య అని, సెల్ ఫోన్ చార్జ‌ర్ వైరుతో యువ‌ పారిశ్రామిక‌వేత్త రాహుల్ ను హ‌త్య చేశార‌ని తేల్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసిన‌ట్లు విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు తెలిపారు. 
 
రాహుల్ హత్య ఈనెల 18 న సాయంత్రం జరిగింది. 19 న పోలీసులకు అత‌ని తండ్రి ద్వారా ఫిర్యాదు అందింది. మొగ‌ల్ రాజ‌పురంలో డి.వి.మ‌నార్ ఎదురు సందులో ఒక కారులో డెడ్ బాడీ ఉందని తెలిసి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. విచారణలో అది యువ పారిశ్రామికవేత్త రాహుల్ డెడ్ బాడీ అని తేలింది. 
 
దీనితో అత‌ని సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా కేసును దర్యాప్తు చేసామ‌ని, అనేక కోణాల్లో విచారణ చేసామ‌ని విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా హత్య జరిగిందని తేలింద‌ని, దీనితో వ్యాపార లావాదేవీలు కారణంగా హత్య జరిగిందని నిర్ధారణకు వచ్చామ‌ని తెలిపారు. 
 
కోరాడ విజయ్ కుమార్ కు రాహుల్ కు మధ్య గొడవ జరిగింద‌ని, కోగంటి సత్యం ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని సి.పి. తెలిపారు. గాయత్రి అనే మ‌హిళ కూతురుకు డిల్లీలో మెడికల్ కాలేజ్ సీటు కోసం  రాహుల్ ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నాడ‌ని, తీరా సీటు ఇప్పించకపోవడంతో గాయత్రి రాహుల్ పైన కక్ష పెంచుకుంద‌ని తెలిపారు. సీటు విషయంలో గాయత్రికి 50 లక్షలు ఇస్తానని రాహుల్ ఒప్పుకున్నాడ‌ని, సీతారాంపురంలోని కోరాడ విజయ్ కుమార్ చిట్స్ కార్యాలయానికి డబ్బులు ఇచ్చేందుకు వెళ్ళాడ‌ని వివ‌రించారు. 
 
ఆ సమయంలో ఘర్షణ జరిగింద‌ని, ఆ తరువాత రాహుల్ ని కోగంటి సత్యంకు చెందిన దుర్గా కళా మందిరంలోని కార్యాలయానికి తీసుకువెళ్లార‌ని తెలిపారు. ఆ త‌ర్వాత అత‌న్ని తీసుకుని వ‌చ్చి కారులోనే మాట్టాడి, ఘ‌ర్ష‌ణ ప‌డి ఛార్జర్ వైర్ తో రాహుల్ ని హత్య చేశార‌ని వివ‌రించారు.
 
రాహుల్ హ‌త్య కేసులో ఏడుగురుని అరెస్ట్ చేసామ‌ని, ఈ నెల 23 న కోగంటి సత్యంని అరెస్ట్ చేసి కోర్ట్ లో హాజరుపరిచామ‌న్నారు. ఈ కేసులో మొత్తం 13 మంది ప్ర‌మేయం ఉంద‌ని, వారిలో ఏడుగురు ని అరెస్ట్ చేసామ‌ని తెలిపారు. 
 
సీతయ్య అనే వ్యక్తి కి లాజిస్టిక్ కాంట్రాక్టు ఇప్పిస్తానని రాహుల్ మోసం చేసాడ‌ని, దీనితో అత‌ను కూడా క‌క్ష పెంచుకున్నాడ‌న్నారు. నిందుతులు రాహుల్ హ‌త్య త‌ర్వాత‌, అత‌ని సెల్ ఫోన్ ని అల్లూరి సీతారామరాజు వంతెనపై నుంచి కాలువలో పడేసార‌ని తెలిపారు.