ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (09:11 IST)

చీరాల టీడీపీ సమన్వయకర్తగా రాజశేఖర్‌

చీరాల టీడీపీ సమన్వయకర్తగా రాజశేఖర్‌ను చంద్రబాబు నియమించారు. చీరాలలో టీడీపీ అభ్యర్థుల పోటీ విషయంపై స్థానిక నేతల మధ్య సమన్వయం కొరవడిన విషయం తెలిసిందే. ప్రధానంగా గతంలో నామినేషన్లు వేసిన వారే అభ్యర్థులు అయినందున అన్ని వార్డుల్లో టీడీపీ పోటీలో లేని పరిస్థితి నెలకొంది.

వైసీపీ పక్షాన ఎమ్మెల్యే బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచిని సమన్వయం చేసి టీడీపీ పక్షాన పోటీకి సిద్ధమయ్యే వారిని మచ్చిక చేసుకుని అత్యధికస్థానాలు ఏకగ్రీవ ఎన్నికకు వైసీపీ ప్రయత్నించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. కొందరు టీడీపీ నేతలు అటు బలరాం, ఇటు కృష్ణమోహన్‌లకు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది.

దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా చీరాలపై దృష్టిసారించారు. సమాచారాన్ని సేకరించుకున్నారు. అటు బాలాజీతోనూ, ఇటు ఏలూరితోనూ మాట్లాడారు. టీడీపీ పక్షాన నామినేషన్లు వేసిన అభ్యర్థులను, ఇతర వార్డుల్లో ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేసి ఉంటే వారిని రంగంలో ఉంచి పోటీకి సిద్ధపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

కోర్టు తీర్పు పెండింగ్‌లో ఉన్నందున కొత్త నోటిఫికేషన్‌ జారీ అయితే టీడీపీ ప్యానల్‌ను పెట్టాలని కూడా అధిష్ఠానం ఆలోచించినట్లు సమాచారం.

తదనుగుణంగా పరిస్థితులను సమీక్షించి అటు బాలాజీ, ఇటు ఇతర నేతలను సమన్వయం చేస్తూ మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల్లో పోటీలో ఉండేలా చూసుకునేందుకు రాజశేఖర్‌ను సమన్వయకర్తగా నియమించారు. బాపట్ల మాజీ ఎంపీ దివంగత బెంజిమన్‌ కుమారుడైన రాజశేఖర్‌ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.