బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (22:08 IST)

రోడ్డు ప్రమాదంలో రిక్షా కార్మికునికి తీవ్ర గాయాలు, మానవత్వం చాటుకున్న కంచికచర్ల ఎస్సై రంగనాథ్

కంచికచర్ల చెరువు కట్ట సమీపంలో ఆదివారం రాత్రి రిక్షా కార్మికుడిని టిప్పర్ లారీ ఢీ కొట్టిన ఘటనలో రిక్షా కార్మికుడు కావాట్టి పుల్లయ్య (50) తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కంచికచర్ల ఎస్సై ఎంపీఎస్ఎస్ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న పుల్లయ్యను చేతిలోనికి తీసుకొని తలకు తగిలిన గాయాన్ని చేతి రుమాలుతో మూసి రక్తస్రావాన్ని ఆపారు.
 
పుల్లయ్య అపస్మారక స్థితిలోకి చేరుకోకుండా మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన రహదారి అంబులెన్స్ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని పుల్లయ్యను చికిత్స నిమిత్తం నందిగామ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.
 
ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ను ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది సరిచేసి అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం చూపించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీ కాగా టిప్పర్‌ను కంచికచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.