శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 17 నవంబరు 2020 (11:43 IST)

సలాం కుటుంబం ఆత్మహత్య కేసు: సిఐపై నిరాధార ఆరోపణలు ఆపకపోతే బలిజల సత్తా చూపుతాం

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సిఐ సోమశేఖర్ రెడ్డిపై నిరాధారమైన అభియోగాలు మోపడాన్ని రాయలసీమ బలిజ మహా సంఘం తీవ్రంగా ఖండించింది. నగరంలోని బాలాజీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షులు వెంకట్ రాముడు మాట్లాడుతూ సలాం కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అన్నారు.
 
సలాం అత్తగారు రోజుకు ఒక ప్రకటన చేస్తున్నారని, ఆమె వెనుక అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ హస్తముందో అర్థం కావడం లేదన్నారు. రెండు పార్టీలు రాజకీయాలు చేయకుండా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. పోలీస్ అధికారి పైన ఏకంగా 306 సెక్షన్ విధించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కుల రాజకీయాలు చేయడం మంచిది కాదని ఆయన రాజకీయ పార్టీలకు హితవు పలికారు. 
 
నిరాధారమైన అభియోగాలతో సీఐ సోమశేఖర్ రెడ్డిని వేధిస్తే బలిజల సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సోమశేఖర్ రెడ్డి ఎస్ఐ, సీఐగా చిత్తూరు, కర్నూలు జిల్లాలో నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అనేక అవార్డులు అందుకోవడం జరిగిందన్నారు.
 
బలిజ కులస్తులపై, కుల అధికారులపై రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా దాడి చేసి, అక్రమ కేసులలో ఇరికిస్తే న్యాయపోరాటంలో బలిజ సంఘం ఎప్పటికీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో పామురాయి వెంకటేశు, చలపతి, కృష్ణమూర్తి, రామ్మోహన్, కోనేటి సాయి ప్రసాద్, నాగేంద్ర ప్రసాద్, గోపీనాథ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.