ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2024 (10:33 IST)

టీడీపీ - జనసేన పార్టీల్లోకి క్యూకడుతున్న వైకాపా కార్పొరేటర్లు

tdp flag
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం వైకాపా నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి చేతుల్లోకి వచ్చింది. దీంతో గత ఐదేళ్లపాటు అధికారం అనుభవించిన వైకాపా నేతలు, అనేక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఇపుడు అధికారం లేక ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నారు. అలాంటి వారంతా సొంత పార్టీ వైకాపాకు టాటా చెప్పేస్తున్నారు. అనేక మంది టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. 
 
ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమా సమక్షంలో వీరు వైసీపీ కండువా కప్పుకున్నారు. పలు చోట్ల వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో... పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. 
 
తాజాగా విజయవాడలో కూడా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ... విజయవాడలో చాలా మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విజయవాడ అభివృద్ధి కోసం ఎవరు ముందుకొచ్చినా వారికి టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధిని ఇప్పుడు మళ్లీ కొనసాగిస్తామన్నారు. విజయవాడను టీడీపీకి కంచుకోటగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ కారణంగా విజయవాడలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. వైసీపీ కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి పనులకు జగన్ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని చెప్పారు.