గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

స్కిల్ కేసులో సంచలనం : మీడియా ముందుకు సీమెన్స్ ఎండీ... అన్నీ కోర్టుకు చెబుతామంటూ...

suman bose
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినట్టుగా చెబుతున్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సంచలనం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న సీమన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ మీడియా ముందుకు వచ్చారు. ఏపీ స్కిల్ డెవలప్‍‌మెంట్ కేసు ఓ నిరాధారమైన కేసుగా ఆయన అభిర్ణించారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందిన తర్వాత 2.32 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ 100 శాతం విజయవంతమైన ప్రాజెక్ట్ అని, 2016లో విజయవంతమైన ప్రాజెక్ట్ కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన ధీమాగా చెప్పారు. ప్రాజెక్ట్ అందించిన ఫలితాలు చూసి మాట్లాడాలని అన్నారు.
 
ఆయన ఆదివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, సంచలన విషయాలు వెల్లడించారు. ఒక్క సెంటర్ కూడా చూడకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ను బోగస్ అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. విజయవంతమైన ప్రాజెక్టును బోగస్ అనడం సరికాదని అన్నారు. ఈ ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తనపై తీవ్రమైన అభియోగాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మార్కెటింగ్‌లో భాగంగా 90:10 ఒప్పందం జరిగిందని, కోర్టులకు అన్ని వివరాలు చెబుతామని సుమన్ బోస్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో మనీల్యాండరింగ్ జరగలేదని తేల్చి చెప్పారు. నిరాధారమైన ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
తాను మీడియా ముందుకు రావడానికి కారణం జీవితంలో తాను సంపాదించుకున్నది గౌరవాన్నని వ్యాఖ్యానించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు వ్యవసాయ రాష్ట్రంగా ఉన్నపుడు ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వచ్చిందన్నారు. 40 ప్రాంతాల్లో 200 ల్యాబ్స్ ఏర్పాటు చేశామని వివరించారు. 2021 నాటికి 2.32 లక్షల మంది నైపుణ్యం సాధించారని వివరించారు. 
 
2021లో స్కిల్ డెవలప్మెంట్ బాగా జరిగిందన్న లెటర్ కూడా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అందుకున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి లేదని, అన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రారంభించామని సుమన్ బోస్ వివరించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. 
 
మనీలాండరింగ్ జరగలేదని, సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు మధ్య ఒప్పందం ఉందని చెప్పారు. ఒక సాఫ్ట్‌వేర్‌పై యువతకి అవగాహన కల్పించినప్పుడు ఆ సాఫ్ట్‌వేర్‌కి డిమాండ్ పెరుగుతుందని, మార్కెటింగ్‌లో భాగంగానే 90:10 ఒప్పందం జరిగిందని స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయన్నారు. న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి కోర్టులకు అన్ని విషయాలు చెబుతామని క్లారిటీ ఇచ్చారు.