గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (16:28 IST)

తెలుగు రాష్ట్రాల్లో గురు, శుక్రవారాల్లో పెళ్ళి బాజాలు మోత

child marriage
ఉభయ గోదావరి జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో పెళ్లి బాజాల మోత మోగనుంది. పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా సందడే సందడి కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఈ నెల 22, 23 తేదీల్లో ఉండటంతో ఉమ్మడి జిల్లాలో 1000 వరకు వివాహాలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్క అన్నవరం దేవస్థానంలోనే ఈ రెండు రోజుల్లో 200కు పైగా జంటలు ఒక్కటవుతాయని చెబుతున్నారు.
 
సత్య, రత్నగిరులపై కల్యాణ మండపాలు, ఇతర ప్రదేశాల్లో వివాహాలు అధికంగా ఉంటాయి. ఈ నెల 22న 92, 23వ తేదీన 87 వివాహాలకు ఇప్పటి0కే ఏర్పాట్లు జరిగాయి. ఇవి కాక ఆలయ ప్రాంగణాల్లో మరో 30 నుంచి 50 వివాహాలు జరుగుతాయని అంచనా. సత్యగిరిపై విష్ణుసదన్‌లో 36 హాళ్లు ఉన్నాయి. ఉచిత కల్యాణ మండపాల్లో ఒకేసారి 28 వివాహాలు చేసుకునే అవకాశముంది. రత్నగిరిపై ఖాళీ ప్రదేశాలు, సీతారామ సత్రం, పాత, కొత్త సెంటినరీ కాటేజీల వద్ద పలు ముహూర్తాల్లో వివాహాలు జరుగుతాయని తెలిపారు. 
 
మరోవైపు, ముహూర్తాల నేపథ్యంలో వసతి గదులకు డిమాండ్ నెలకొంది. కొండపై సుమారు 450 గదులు ఉన్నప్పటికీ ఇవి చాలని పరిస్థితి. ఇప్పటికే 30 శాతం గదులు ముందస్తుగా కేటాయించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల నుంచి సిఫార్సు లేఖలు పెద్దసంఖ్యలో వచ్చాయి. దీంతో ఇబ్బందులు లేకుండా అధికారులు గదులను సర్దుబాటు చేస్తున్నారు. కాగా రత్నగిరిపై వివాహ గుమ్మటాలు (అలంకరణ ఏర్పాట్లు) వేసుకునే వారి నుంచి దేవస్థానమే ప్రస్తుతానికి రుసుము వసూలు చేస్తుంది. వివాహాలు చేసుకునేవారు మండపాలు వేసుకుంటే నిర్ణీత సొమ్మును తీసుకొని రసీదు ఇస్తారు.