శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 29 మే 2019 (18:26 IST)

తెలుగు ప్రజలకు చల్లని కబురు..3 రోజులు ముందుగానే..

వేసవి తాపంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే దక్షిణాదిని తాకనున్నాయన్నది ఆ కబురు. ఈ ప్రభావంతో ఈసారి త్వరగానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు చెప్పారు. జూన్ 6వ తేదీ నాటికి రుతుపవనాలు రానున్నాయని భావించినప్పటికీ అది కాస్తా ఇప్పుడు మరో మూడు రోజుల ముందుగానే, అంటే జూన్ 3వ తేదీ నాటికి రుతుపవనాలు దక్షిణాదిని పలకరిస్తాయని వాతావరణ శాఖ అంటోంది.
 
ముందస్తుగా రానున్న నైరుతి రుతుపవనాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలలో వర్షాలు కురవనున్నాయి. ఊహించిన దానికంటే నైరుతి రుతుపవనాలు ఈసారి అండమాన్‌ను తాకాయి. ప్రతి యేడాది మే 20వ తేదీ నాటికి అండమాన్‌ను తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి మే 18 నాటికే వచ్చాయి. ప్రస్తుతం రుతుపవనాలు తమిళనాడు, దక్షిణ సరిహద్దు కర్ణాటక నుంచి కొమెరిన్‌ వరకు విస్తరించి ఉన్నాయి. 
 
రెండు రోజుల్లో కేరళతో పాటు కర్నాటక దక్షిణ సరిహద్దుల్లో భారీ నుండి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకనున్నాయని భావించినా మరో మూడు రోజులు ముందుగానే కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.