'అమలాపురం' అష్టదిగ్బంధనం - అన్ని దారులు మూసివేత
రణరంగాన్ని తలపిస్తున్న అమలాపురంను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. ఈ ప్రాంతానికి వచ్చే అన్ని దారులను మూసివేశారు. ఇంటర్నెట్ సేవలతో పాటు ఆర్టీసీ బస్సుసేవలను నిలిపివేశారు. ఒక డీఐజీ, నాలుగు జిల్లాల ఎస్పీలతో పాటు.. భారీ సంఖ్యలో అమలాపురంలోనే మొహరించి పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా, రావులపాలెంలో ప్రత్యేక బలగాలను మొహరించారు. అలాగే, అమలాపురం వ్యాప్తంగా సెక్షన్ 144, పోలీస్ యాక్టు 30ను అమలు చేస్తున్నారు.
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రభుత్వం పేరు మార్చింది. దీనికి వ్యతిరేకంగా కోనసీమ జిల్లా సాధన సమితి మంగళవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని పోలీసులు దిగ్బంధించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎక్కడకిక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారుల్లో నిఘాపెట్టి అమలాపురంలోకి ఎవరూ ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి మొహరించారు.