శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

దేశ సాగునీటి రంగంలో తొలిసారి... క్రస్ట్ గేట్ స్టాఫ్‌లాగ్ అమర్చిన ఇంజనీర్లు

stoplog
దేశ సాగునీటి రంగంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంజనీర్లు చరిత్ర సృష్టించారు. వరదపోటు కారణంగా కొట్టుకుపోయిన క్రస్ట్ గేట్ స్థానంలో స్టాఫ్‌లాగ్‌ను అమర్చారు. తుంగభద్ర జలాశయంలో కొట్టుకునిపోయిన 19వ క్రస్ట్ గేట్ స్థానంలో ఈ స్టాఫ్‌లాంగ్‌ను విజయవంతంగా అమర్చారు. దీంతో నీటి వృథాకు అడ్డుకట్ట పడింది.
 
ఈ నెల 10వ తేదీన వరద పోటు కారణంగా గేటు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి కొత్త గేటును అమర్చేందుకు ఇంజినీర్లు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. గేట్ల రూపకల్పనలో నిపుణుడైన కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో ఇంజినీర్ల బృందం శనివారం స్టాఫ్‌ లాగ్ గేటును బిగించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రక్రియ గత రాత్రితో పూర్తయింది.
 
మొత్తం ఐదు స్టాఫ్‌ లాగ్ ఎలిమెంట్లలో శుక్రవారం ఒకటి బిగించగా, శనివారం మిగతా నాలుగింటిని బిగించారు. గేటు కొట్టుకుపోయినప్పటి నుంచి గేటు బిగించే వరకు మొత్తంగా 30 వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. మొదటి ఎలిమెంట్ బిగించిన తర్వాత కూడా కొంత నీరు వృథా అయింది. అయితే, రెండోది అమర్చాక నీటి వృథాకు అడ్డుకట్ట పడింది.