మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (14:42 IST)

ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్న సీఎం జగన్ : చంద్రబాబు

chandrababu
రాజధాని విషయంలో వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలతో పాటు.. చిచ్చులు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 
 
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వివిధ జిల్లాల న్యాయవాదులు కార్యక్రమానికి హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ఎన్నో కీలక మార్పులకు తెదేపా నాంది పలికిందని చెప్పారు. న్యాయవాదులకు అవకాశాలు ఇచ్చి గుర్తింపు తెచ్చిన పార్టీ తెదేపా అన్నారు. సమర్థులను నియమించి రాష్ట్ర అభివృద్ధికి తెదేపా ఎంతో కృషి చేసిందని చెప్పారు.
 
'రుషికొండను తవ్వేసి బోడికొండలా చేశారు. ఈ అంశంపై ఓ పక్క కోర్టులో విచారణ జరుగుతుంటే.. మరోపక్కన కొండను తవ్వేస్తున్నారు. పోలవరాన్ని మేం 70 శాతం పూర్తి చేస్తే.. దాన్ని ముంచేశారు. అమరావతి కోసం రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్‌ చేసిన ఘనత తెదేపాది. 
 
అలాంటి అమరావతికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ సరే అన్నారు. చిన్న రాష్ట్రం, విభేదాలు వద్దని అప్పుడు చెప్పి.. ఇప్పుడు 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ధర్మం, న్యాయం కోసం పోరాడుతున్నాం. నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోరాడుతూనే ఉంటాం.. దానికి న్యాయవాదుల సహకారం కావాలి అని అన్నారు.