అధైర్యపడొద్దు... అక్రమ కేసు బాధితులకు చంద్రబాబు ఫోన్
చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో అక్రమ కేసుల బాధిత కుటుంబాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. అంగల్లు, పుంగనూరు ఘటనల్లో చంద్రబాబుతో సహా వందల మంది తెదేపా నేతలు, కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు 12 ఎఫ్‌ఐఆర్‌లు కాగా, 317 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్‌లతో కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 81 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పెద్దఎత్తున అరెస్టులతో బాధితుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
ఈ క్రమంలో అరెస్టు అయిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని తెలిపారు.
తప్పుడు కేసులు కోర్టులో నిలబడవన్నారు. కార్యకర్తల అక్రమ అరెస్టులు తనను ఎంతో బాధించాయని.. న్యాయ పోరాటం ద్వారా వారందరినీ సాధ్యమైనంత త్వరగా బయటకు తీసుకొస్తామని తెలిపారు.
అక్రమ కేసులతో వందల కుటుంబాల క్షోభకు కారణమైన ప్రతి ఒక్కరూ రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లిస్తారని చంద్రబాబు హెచ్చరించారు. ఆయా గ్రామాల్లో కుటుంబ సభ్యుల అరెస్టులతో తల్లడిల్లుతున్న వారికి ఒక తండ్రిలా తాను అండగా ఉంటానన్నారు.