శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2019 (12:39 IST)

ఆర్టీసి ఛార్జీల పెంపుపై ధ్వజమెత్తిన అచ్చెన్నాయుడు

నవ్యాంధ్రలో ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీఎల్పీ అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెవెలుగు, సిటి సర్వీసులు కిమీకు 10 పైసలు, మిగిలిన వాటిపై కిమీ కు 20 పైసలు పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం ఆమోదించారని మంత్రి పేర్ని నాని చెప్పడం ప్రజలను వంచించడమే. ఇదే అంశంపై ఆయన ఓ పత్రికా ప్రకటన చేశారు.
 
ప్రజలపై పైసా భారం వేయనని పాదయాత్రలో జగన్ చెప్పారు. పన్నులు, ఛార్జీలు పెంచమని చెప్పి ప్రజలను నమ్మించారు. 6 నెలల్లోనే ఆర్టీసి ఛార్జీలు పెంచడం ప్రజలను మోసగించడమే. జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మరోసారి రుజువైంది. ఆర్టీసి ఛార్జీల పెంపు నిర్ణయం జగన్ చేతగానితనానికి నిదర్శనం. 
 
ఆర్టీసి రూ.1200 కోట్ల నష్టాలలో ఉందని చెప్పడం హాస్యాస్పదం. తెదేపా ఐదేళ్ళ పాలనలో పేదలపై భారం మోపలేదు. భారాలు వేయకుండానే ఆర్టీసీని బలోపేతానికి చర్యలు చేపట్టాం. బస్సులు కొనడానికి భారీగా నిధులు ఇచ్చాం. ఆర్టీసీ కార్మికులకు 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా ప్రజలపై భారం వేయలేదు.
 
 రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటులో కూడా ప్రజలపై భారాలు వేయని ఘనత తెదేపాదే. కరెంటు ఛార్జీలు, ఆర్టీసి ఛార్జీలు పెంచేది లేదని చెప్పాం. ఆచరించి చూపించాం. అలాంటిది వైసీపీ ప్రభుత్వం పేదలను దారుణంగా మోసగించింది.
 వైసీపీ పాలనలో పవర్ ఉండదు, పవర్ ఛార్జీలు పెంచుతాం అంటారు. ఆర్టీసిలో వసతులు పెంచరు, ఛార్జీలు పెంచుతాం అంటారు. 
 
ఒకవైపు ఉల్లి ధరలు విపరీతంగా పెంచేశారు. మరోవైపు ఆర్టీసి ఛార్జీలు పెంచుతున్నారు. సామాన్యుడి నడ్డి విరగ్గొట్టడమే వైసిపి ధ్యేయంగా పెట్టుకుంది. ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం. తెదేపా వెల్ఫేర్ స్కీమ్‌లు అనేకం రద్దు చేసింది. ఆదరణ 2, చంద్రన్న బీమా, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, ఫుడ్ బాస్కెట్ అన్నీ రద్దు చేసింది. వైసీపీ తెచ్చిన పథకాల్లో అన్నీ ఆంక్షలు, కోతలు పెట్టింది. 
 
పేదల సంక్షేమాన్ని కాలరాయడమే ధ్యేయంగా సీఎం జగన్ వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. 
సంక్షేమం ముసుగులో ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు. రాష్ట్రాన్నే ఏకంగా అమ్మేయాలని చూస్తున్నారు. వీటన్నింటికి తగిన మూల్యం చెల్లించక తప్పదని అచ్చెన్నాయుడు ఆరోపించారు.