చంద్రబాబుకు సంసారం చేసే టైమ్ కూడా లేదు... అలా శ్రమించారు : జలీల్ ఖాన్
సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడాన్ని ఆ పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఓటమిపై టీడీపీ నేతలు తలోరకంగా స్పందిస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందిస్తూ, నవ్యాంధ్ర రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేతగా, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషిచేశారన్నారు. ముఖ్యంగా, ఆయన సంసారానికి కూడా సమయం కేటాయించలేక పోయారన్నారు.
అలాంటి చంద్రబాబును ప్రజలు విస్మరించి ఓడించడం బాధగా ఉందన్నారు. పైగా, అతి తక్కువ సమయంలో ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు... రాష్ట్ర ప్రజల కోసం సంసారం కూడా చేయలేక పోయారన్నారు.
రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, ఇతర స్వతంత్ర అభ్యర్థుల రాకవల్ల టీడీపీకి లాభం జరుగుతుందని భావించామనీ, కానీ, ఇంతలా హాని చేస్తుందని తాము గ్రహించలేకపోయామన్నారు. ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ చూడని ఓటమిని టీడీపీ ఎదుర్కోవాల్సి వచ్చిందని జలీల్ ఖాన్ చెప్పుకొచ్చారు.