గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 మే 2023 (17:34 IST)

బాబాయ్ హత్య కేసు నుంచి దృష్టి మరల్చలేరు : టీడీపీ ఎంపీ

Rammohan Naidu
సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నేతలపై పోలీసులను ఏపీ ప్రభుత్వం ఉసిగొల్పిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా, జగత్ జనని చిట్ ఫండ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన తనయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త శ్రీనివాస్‌(వాసు)లను ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిందని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ, గతంలో తమ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇలాగే అరెస్టు చేశారన్నారు. ఎలాంటి మచ్చలేని నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, వాసు. ప్రశ్నించేవారి గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగానే వారిని అరెస్ట్‌ చేశారు. ఎన్ని కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా వెనకడుగు వేసేది లేదు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైకాపా ప్రభుత్వం ఈ నాటకాలు ఆడుతోంది. రాజమహేంద్రవరంలో నిర్వహించే తెదేపా 'మహానాడు' చరిత్రలో నిలిచిపోతుంది అని ఆయన అన్నారు.