సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:32 IST)

స్పీకర్ తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ రగడ.. టీడీపీ నేతల ప్రశ్నల వర్షం!

narsireddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి తమ్మినేని సీతారం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ గోల ఇపుడు ఏపీ రాష్ట్రంలో పెను చర్చనీయాంశంగా మారింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో చదవకుండానే తమ్మినేని సీతారాంకు డిగ్రీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందంటూ టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంపై టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. తమ్మినేని నకిలీ సర్టిఫికేట్‌పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
తమ్మినేని తనదిగా చెబుతున్న హాల్ టిక్కెట్ (నంబర్ 1791548430) డి.భగవంత్ రెడ్డ తండ్రి బి.స్వామిరెడ్డి పేరిట ఉందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే తమ్మినేని బీకాం డిగ్రీ సర్టిఫికేట్‌తో పాటు ప్రొవిజినల్, మైగ్రేషన్ సర్టిఫికేట్, టీసీ ఇలా అన్నీ నకిలీ సర్టిఫికేట్లేనని అర్థమవుతుందన్నారు. 
 
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన తమ్మినేని మూడేళ్ల లా కోర్సు ఎలా చేశారన్న అనుమానంతో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. బీఆర్అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలోని నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ నుంచి 2015-18లో తమ్మినేని బీకాం పూర్తి చేసినట్టుగా సర్టిఫికేట్లు సమర్పించారని, కానీ ఆ సెంటరులో 2015లో చదువుకున్న మొత్తం 839 మంది విద్యార్తుల జాబితాలో తమ్మినేని పేరు లేదని నర్సిరెడ్డి తెలిపారు. 
 
ఇక మూడేళ్ల న్యాయ కోర్సు కోసం తమ్మినేని సమర్పించిన ఓపెన్ యూనివర్శిటీ సర్టిఫికేట్లు నిజమైనవేనా? లేదా? తేల్చాలని సమాచార హక్కు చట్టం కింద అడిగితే తమ రికార్డుల్లో ఆయన సర్టిఫికేట్లు సరిపోలడం లేదని వర్శిటీ అధికారులు ధృవీకరించారని నర్సిరెడ్డి తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరిపి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.