సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (17:13 IST)

ఇపుడు సంపద సృష్టిస్తున్నాం... ప్రజలకు పంచుతాం : భట్టి విక్రమార్క

bhatti vikramarka
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించే పనిలో నిమగ్నమైవుందని, ఆ సంపదను ప్రజలకు పంచుతామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
 
'పదేళ్ల పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎంతో పోరాడారు. భారాస ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, కాంగ్రెస్‌ కార్యకర్తలు భయపడలేదు' ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే హామీలు అమలు ప్రారంభించామని తెలిపారు. 'మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం ప్రతి నెలా రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం. ఒకే విడతలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించాం. ప్రజల కోసం సంపద సృష్టిస్తున్నాం.. మళ్లీ ప్రజలకు పంచుతున్నాం' అని వివరించారు.
 
'సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది. వెనుకబడిన కులాలకు కాంగ్రెస్‌ ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. కార్యకర్తల శ్రమ, త్యాగం వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కష్టపడి పనిచేసిన వారిని పార్టీ ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని మరోసారి రుజువైంది. 2029లో రాహుల్‌ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు' అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు.