ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (19:58 IST)

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏటా పదివేలు

రాష్ట్ర ప్రభుత్వ హామీలలో భాగంగా సొంతగా ఆటో, క్యాబ్ వాహనాన్ని నడుపుకొనే డ్రైవర్లకు ప్రతి ఏటా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వము మార్గదర్శకాలతో కూడిన జీవో ఎమ్ ఎస్ నెంబర్ 34 ను తేదీ 09.09.2019న జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఎ యండి ఇంతియాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. 
 
సంబంధిత విధి విధానాలతో రూపొందించిన  జీవోలో ఎవరెవరికి ఈ సహాయం, ఈ సహాయం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి పొందుపరిచినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆన్ లైన్ లో దరఖాస్తులను అభ్యర్థులు నింపవలసి ఉంటుందని, ఆ దరఖాస్తులను పూర్తిచేయడంలో సహాయం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రవాణాశాఖ కార్యాలయాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. 

 
ఈ పథకం ద్వారా లబ్ది పొందగోరు అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా తన పేరుపై సొంత ఆటో, క్యాబ్ కలిగివుండి, తానే నడుపుకుంటూ ఉండాలన్నారు. వాహనానికి ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ మొదలైన వాహన రికార్డులన్నీ కాలపరిమితితో చెల్లుబాటులో ఉండాలని, అభ్యర్థి ఆటో/ క్యాబ్ వాహనాలు నడిపేందుకు సంబంధిత అర్హత కలిగిన డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు.
 
నియమ నిబంధనలు:
అభ్యర్థి తన వాహనానికి మరియు లైసెన్స్ కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. ఈ పథకంలో రుణంకింద మినహాయించికోవడానికి వీలులేని బ్యాంకు ఖాతాను తెరుచుకోవాలి. ఈ బ్యాంకు ఖాతాను తెరిపించే విధానంలో గ్రామ/వార్డు వాలెంటర్ల్లు సహాయం చేస్తారు. ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకోవడానికి, బ్యాంకు ఖాతాను తెరవటానికి పదిహేను రోజుల సమయం ఇస్తారు.
 
 ఈ పథకంలో ఆటో/ క్యాబ్ కలిగిన కుటుంబంలో ఒకరికి మాత్రమే ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతుంది. ( కుటుంబం అంటే భార్య భర్త మరియు మైనర్ పిల్లలు) ఆన్లైన్ లో దరఖాస్తును నింపే సమయానికి ఆటో/క్యాబ్ వాహనం అభ్యర్థి పేరుతో కలిగి ఉండాలి. దరఖాస్తును నింపిన పిదప ఆ దరఖాస్తులను గ్రామ/వార్డు వాలంటీర్లకు పంపించబడతాయి.
 
 గ్రామ వార్డు వాలంటీర్లు దరఖాస్తులను పరిశీలించిన పిదప మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులు, జిల్లా కలెక్టర్ గార్ల ఆమోదం పొంది ఆ వివరాలన్నింటినీ సి ఎఫ్ ఎం ఎస్ (CFMS) డేటాబేస్ పోర్టర్ లో అప్లోడ్ చేయబడతాయి. జిల్లా కలెక్టర్ ఆమోదించబడిన అభ్యర్థుల జాబితా ఆధారంగా రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ ఆర్థిక బిల్లులను తయారు చేయించి ట్రెజరీకి వెరిఫికేషన్ కొరకు పంపించి, తదుపరి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అభ్యర్థుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది.
 
 ఆర్థిక సహాయం బ్యాంకు ఖాతాలో జమ అయిన పిమ్మట,  గ్రామ/వార్డు వాలంటీర్లు లబ్దిపొందు ప్రతి అభ్యర్థి ఇంటికి వెళ్లి  చెల్లింపు రసీదును మరియు గౌరవ ముఖ్యమంత్రి సందేశాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 55 వేల మంది లబ్ధిదారులకు వారి అర్హతను బట్టి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉన్నదని, జిల్లాలో ఉన్న అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని జిల్లా కలెక్టరు ఎ యండి ఇంతియాజ్ కోరారు.