శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:46 IST)

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ సస్పెన్షన్‌ సరికాదు: సీపీఐ

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం సరికాదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయడం కక్షసాధింపు ధోరణిలా కనిపిస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్షన్ ధోరణితో ముందుకెళ్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే అధికారుల్లో అభద్రతాభావం నెలకొంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన కక్షసాధింపు వైఖరి మానుకోవాలని రామకృష్ణ సూచించారు.
 
కేశినేని సెటైర్లు
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై ఎంపీ కేశినేని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

‘వైసీపీ అధికారంలోకి రావడానికి..టీడీపీ ఓడిపోవటానికి.. ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే.. సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
ఆందోళన చెందాల్సిన పని లేదు
సస్పెన్షన్‌పై ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. నేడు ఆయన తన బంధుమిత్రులు, సన్నిహితులను ఉద్దేశించి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

మీడియాలో వస్తున్న కథనాలలో వాస్తవం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల మానసికంగా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.

ఈ చర్యను ఎదుర్కొనేందుకు చట్టపరంగా తనకున్న అవకాశాలను పరిశీలిస్తున్నానన్నారు. ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.