బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (19:29 IST)

రాజకీయాలే ముఖ్యం అన్నది టీడీపీ పాలసీ: మంత్రి బొత్స

ఎంతసేపటికీ తెలుగుదేశం, ఆ పార్టీ అనుకూల మీడియాకు రాజకీయ, సొంత ప్రయోజనాలు తప్పితే ప్రజా ప్రయోజనాలు పట్టవని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  ఎన్నికలు పూర్తి అయ్యాక పట్టణ, నగర ప్రాంతాల్లో పన్నులు పెంచేస్తున్నారని ప్రతిపక్షాలు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అవాస్తవాలు, అసత్యాలను ప్రచారం చేస్తూ, రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. 
 
విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా, ఆస్తి విలువ ఆధారితంగా పన్నులు నిర్ణయించాలని ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని, దాన్ని చట్టం చేసిందని మంత్రి బొత్స గుర్తు చేశారు.

ఈ నూతన విధానం వల్ల ప్రభుత్వానికి అదనంగా వచ్చే ఆదాయం కేవలం రూ. 186 కోట్లేనని, అయితే దీనివల్ల గతంలో లోపభూయిష్టంగా ఉన్న పన్నుల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గాడిలో పెట్టారని చెప్పారు.

నూతన ఆస్తి పన్ను విధానం వల్ల ఒక్క విజయవాడ నగరానికే రూ. 500 కోట్లు ఆదాయం వస్తుందంటూ ప్రతిపక్షాలు అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నాయని, వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఆస్తి పన్నుకు సంబంధించిన డిమాండ్ 1242 కోట్లు ఉంటే, అది ఇప్పుడు రూ. 1428 కోట్లుకు పెరిగిందని అంటే వ్యత్యాసం రూ. 186 కోట్లేనని మంత్రి వివరించారు. వాస్తవం ఇలా ఉంటే, ప్రతిపక్షాలు ఏ ఉద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయో ఆలోచించాలని ప్రజలను కోరారు. 
 
బలహీనుడు, బలవంతుడు, పేద, ధనిక అన్న తేడా లేకుండా, రాజకీయ సిఫార్సులకు, అవినీతి ఆస్కారం లేకుండా అందరికీ యూనిఫాంగా ఉండే విధంగా, అద్దె ఆధారిత పన్నును పక్కనపెట్టి, ఆస్తి విలువ ఆధారిత పన్నులు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ విధానం వల్ల రాష్ట్రంలో ఏ పురపాలక సంఘం పరిధిలో అయినా గరిష్టంగా 15 శాతానికి మించి ఒక్క పైసా కూడా పన్ను పెరిగే పరిస్థితి లేదు అని స్పష్టం చేశారు.

అదే 375 చదరపు అడుగుల లోపల నివాస గృహాల్లో ఉండే పేదలకు సంవత్సరానికి పన్ను కేవలం రూ. 50 మాత్రమేనని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉంటే, వేల కోట్లు పన్నులు బాదేస్తున్నారని, పెంచేశారని తెలుగుదేశం పార్టీ, కొన్ని తోక పార్టీలు, ఓ వర్గం మీడియా ఇష్టం వచ్చినట్లు అవాస్తవాలను ప్రచారం చేస్తూ, ప్రజల్లో లేనిపోని భయాలను, అనుమానాలను రేకెత్తిస్తోందని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.