బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 12 జనవరి 2022 (15:04 IST)

తిరుమలకు 3 గంటలు కాదు.... 40 నిమిషాల్లోనే....

తిరుమ‌ల‌ రెండ‌వ రోడ్డును పునరుద్ధరణ పనులను పూర్తి చేసి టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి  ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ అప్ ఘాట్ రోడ్డులో భారీ బండరాళ్లు ప‌డ‌టం వ‌ల‌న మూడు ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బ‌తిన్నట్లు చెప్పారు.
 
 
అయితే జ‌న‌వ‌రి 10వ తేదీకి అప్ ఘాట్ రోడ్డును భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకురావ‌ల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. అయితే సిఇ ఆధ్వ‌ర్యంలో టిటిడి ఇంజినీరింగ్ అధికారులు, ఆఫ్కాన్ సంస్థ ప్ర‌తినిధులు క‌లిసి పగలు, రాత్రి విరామం లేకుండా ఘాట్‌ రోడ్డు మరమ్మతు పనులను శరవేగంగా పూర్తి చేసి నిర్ణీత స‌మ‌యంలోనే భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు.

 
అయితే అక్క‌డ‌క్క‌డ చిన్న‌పాటి మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు పూర్తి చేయ‌వ‌ల‌సి ఉండ‌గా భారీ వాహనాలు లింక్ రోడ్డు ద్వారా మాత్రమే అనుమతించబడతాయ‌ని చెప్పారు. దాదాపు 40 రోజుల త‌రువాత భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా ర‌వాణా సౌక‌ర్యాం ప్రారంభించామ‌న్నారు. టిటిడి ఇంజినీరింగ్ విభాగం అధికారులు చేసిన కృషికి చైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌ర‌పున అద‌న‌పు ఈవో హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేశారు.  

 
అయితే ఘాట్ రోడ్డు మరమ్మత్తులు కారణంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి భక్తులకు ఏర్పడింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళాలంటే ఒకే ఘాట్ రోడ్డులో మూడు గంటల సమయం పట్టేది. ప్రస్తుతం ఘాట్ రోడ్డు పూర్తి కావడంతో కేవలం 40 నిమిషాల్లో తిరుమలకు చేరుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి కావడంతో విఐపిలు, సామాన్యులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. టిటిడి త్వరితగతిన ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.