బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (22:51 IST)

రేపు, ఎల్లుండి అమరావతి నిరసన కార్యక్రమాలు

రాజధాని అమరావతి ఉద్యమం 300 రోజులు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 11 , 12 తేదీలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జెఎసి కన్వీనర్ ఎ.శివారెడ్డి తెలిపారు. ఆటోనగర్ లోని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12 వ తేదీతో 300 రోజులు పూర్తవుతున్న సందర్భంగా 175 నియోజక వర్గాలలో అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 299 వ రోజు ఈనెల 11 వ తేదీ ఆదివారం ' అమరావతి పరిరక్షణ భారీ ర్యాలీ ', 12 వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని రెవిన్యూ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి చర్చించుకుంటున్నారని, అమరావతి రాజధాని కావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. రాజధానికోసం భూములు ఇచ్చిన రైతులతో పాటు, మహిళలు ఎంతో మంది రాష్ట్ర భవిష్యత్తు అమరావతి రాజధాని ద్వారానే సాధ్యమని 300 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శించారు.

300వ రోజు చేరుకుంటున్న సందర్భంగా ఉద్యమ కార్యాచరణపై ఇటీవల అఖిల పక్ష సమావేశం అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నేతలతో ఏర్పాటుచేసిన తరువాత వారి సూచనల మేరకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ 300 రోజులు కార్యక్రమం తరువాత జెఎసి విస్రృత కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఉద్యమం మరింత పెంచనుందన్నారు.

ఇందులో భాగంగానే మండల స్థాయిల్లోనూ, పార్లమెంటరీ స్థాయిలోనూ జెఎసి కమిటీలను ఏర్పాటుచేసి అమరావతి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు జెఎసి మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అది సరైన పద్దతి కాదన్నారు. వీటన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి వింటున్నారా అని ప్రశ్నించారు.

మంత్రులు, శాసన సభ్యులు తమ కుటుంబ సభ్యులతో అయితే ఇలాగే మాట్లాడతారా ఒకసారి గమనించండి అంటూ వారి విగ్నతికే వదిలేస్తున్నామని అన్నారు. అమరావతి రైతు కార్యాచరణ సమితి కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు ప్రజాప్రతినిధులు హేళనగా మాట్లాడుతున్నారని, రాజధానిపై ప్రభుత్వం లేనిపోని సమస్యను సృష్టించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ అనాలోచన నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోయిందని, ప్రజలు మౌనంగా ఉంటే ప్రభుత్వం స్పందించదని .. అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకుని అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి జెఎసి కన్వీనర్ మల్లిఖార్జునరావు , కె. రాజేంద్ర, వాసిరెడ్డి వంశీకృష్ణ ఇతర జెఏసీ నాయకులు పాల్గొన్నారు.