టిటిడి కొత్త బిజినెస్.. ఏంటది?
తిరుపతి పాత డిపిడబ్ల్యు స్టోర్స్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, తిరుపతి ఎంపి డాక్టర్ శ్రీ గురుమూర్తి, యం.ఎల్.ఏ శ్రీ భూమన్ కరుణాకర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం కోసం దేశంలోనే 15 ప్రముఖ వైద్యశాలలతో ఎంఓయు కుదుర్చుకున్నారు. తరువాత వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజితో ఆకర్షణీయంగా రూపొందించిన శ్రీవారి ఫోటోలతో పాటు కీచైన్లు, పేపర్ వెయిట్లు, విక్రయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఆధ్వర్యంలో నమామి గోవింద పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రం ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 15 రకాల ఉత్పత్తులు భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రతి ఆలయంలో గోవు ఉండాలి, గో పూజ నిర్వహించాలన్నారు. భక్తులు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఇందుకోసం కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక సహకారంతో ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన పంచగవ్యలను టిటిడి గోశాలలోని గోవుల నుండి సేకరించనున్నట్లు తెలిపారు.
టిటిడి ధర్మకర్త ల మండలి నిర్ణయం మేరకు టిటిడి గో శాలలను అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోని వివిధ గోశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారుచేస్తున్న అగరబత్తీలకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. కావున అగరబత్తీల ఉత్పత్తి రెండింతలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అదేవిధంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజితో తయారు చేసిన కళాకృతులు గురువారం నుండి భక్తులకు విక్రయించనున్నట్లు చెప్పారు. టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం కొరకు 15 వైద్యశాలలతో ఎంఓయు చేసుకున్నట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో సనాతన ధర్మ వ్యాప్తికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.
అనంతరం ఈవో మాట్లాడుతూ, సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు పంచగవ్యాలతో పలురకాల గృహావసర ఉత్పత్తులు తయారు చేయాలని టిటిడి నిర్ణయించిదన్నారు. ఇందులో బాగంగా నమామి గోవింద బ్రాండ్ పేరుతో 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను నేటి నుండి తిరుమలలో భక్తులకు విక్రయానికి ఉంచామన్నారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలకు దేశీయ గో జాతుల నుండి సేకరించిన పాలు, నెయ్యి వినియోగిస్తున్నామన్నారు. అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో స్వామివారికి నైవేద్యం, గత ఏడాది నవనీత సేవ ప్రారంభించామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయంపై ఎంఓయు కుదుర్చుకున్నామన్నారు. ఇందులోని రైతులు గోవుల నుండి లభించే గో మూత్రం, గోమయం నుండి ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారు చేసుకుని, రసాయన ఎరువులు వినియోగించకుండా పండించిన పప్పు దినుసులను టిటిడి కొనుగోలు చేస్తుందన్నారు. రాబోవు రోజుల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు రెండు ఆధునిక గోశాలను అభివృద్ధి చేసి, అక్కడ ఉన్న యువతకు పంచగవ్య ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.